ధీరుభాయ్ అంబానీ | |
---|---|
2002 లో అంబానీ పేరు మీద భారత తపాలా సంస్థ విడుదల చేసిన తపాలా బిళ్ళ | |
జననం | ధీరజ్ లాల్ హీరాచంద్ అంబానీ (1932-12-28)1932 డిసెంబరు 28 చోర్వాడ్, జునాగఢ్ రాష్ట్రం, కథియావార్ ఏజెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం గుజరాత్) |
మరణం | 2002 జూలై 6(2002-07-06) (వయసు 69) ముంబై, మహారాష్ట్ర |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఇన్ ఫ్రా, రిలయన్స్ పవర్ వ్యవస్థాపకుడు |
జీవిత భాగస్వామి | కోకిలా ధీరుభాయ్ అంబానీ |
పిల్లలు | నీనా అంబానీ, ముకేష్ అంబానీ, అనిల్ అంబానీ, దీప్తి అంబానీ |
పురస్కారాలు | పద్మవిభూషణ్ (మరణానంతరం 2016) |
ధీరుభాయ్ అంబానీ గా పేరుపొందిన ధీరజ్‌లాల్ హీరాచంద్ అంబానీ (1932 డిసెంబరు 28 – 2002 జులై 6) భారతదేశ వ్యాపారవేత్త.
రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు. 1977లో ఈ సంస్థ పబ్లిక్ కి వెళ్ళింది. 2016లో భారత ప్రభుత్వం ఆయన వ్యాపార, వాణిజ్యాల్లో ఆయన చేసిన కృషికి గాను మరణానంతరం పద్మ విభూషణ్ పురస్కారం అందజేసింది. ఆయన మరణం తర్వాత కుమారులు ముకేష్ అంబానీ, అనిల్ అంబానీ ఇద్దరూ వ్యాపార సామ్రాజ్యాన్ని పంచుకున్నారు.
ధీరుభాయ్ అంబానీ 1932 డిసెంబరు 28న హీరాచంద్ గోర్ధంభాయ్ అంబానీ, జనమ్ బెన్ అంబానీ దంపతులకు బ్రిటిష్ ఇండియాలోని బాంబే ప్రెసిడెన్సీ, కథియావార్ ఏజెన్సీ, జునాగఢ్ రాష్ట్రం, చోర్వాడ్ లో జన్మించాడు.
ఈ ప్రాంతం ప్రస్తుతం గుజరాత్ లో ఉంది.[1] తండ్రి పాఠశాల ఉపాధ్యాయుడు. బహదూర్ కంజి పాఠశాలలో చదువుకున్నాడు. ఈయనకు 17 ఏళ్ళు రాకముందే స్థానికంగా చిన్న వ్యాపారాల్లో పూర్తి పట్టు సంపాదించారు.
యువకుడిగా ఉన్నప్పుడు భారతదేశ స్వాతంత్ర్యానంతరం రాష్ట్రాన్ని పాకిస్థాన్ లో విలీనం చేసే ప్రయత్నానికి అడ్డుకునేందుకు జునాగఢ్ నవాబుకు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించాడు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంధనం మీద ఎక్కువగా ఆధారపడి ఉందని గ్రహించిన ఈయన చిన్న వయసులోనే గమనించాడు. ఒక దశలో అప్పటిదాకా తాను వ్యాపారంలో సంపాదించిన ధనాన్ని తండ్రికి ఇచ్చి భారతదేశాన్ని వదిలి బ్రిటిష్ కాలనీగా ఉన్న ఆడెన్ చేరుకుని అక్కడ బ్రిటిష్ షెల్ అనే ఇంధన కంపెనీలో 300 రూపాయాల జీతానికి ఉద్యోగంలో చేరాడు. ఇది ఆయనకు చమురు పరిశ్రమకు సంబంధించిన అనుభవాన్ని సమకూర్చింది.
కొన్నాళ్ళ తర్వాత పదోన్నతితో షెల్ కంపెనీకి అనుబంధంగా ఉన్న ఎబీస్ కంపెనీలో చేరాడు. అరబిక్ భాష నేర్చుకుని స్థానిక వ్యాపారులతో సత్సంబంధాలు ఏర్పరుచుకున్నాడు.
1958లో ఆయన భారతదేశానికి తిరిగి వచ్చాడు. అప్పటి తన స్వంత రాష్ట్రమైన సౌరాష్ట్ర తన వ్యాపారానికి అంత అనుకూలంగా ఉండదని భావించి తన మకాం ముంబైకి మార్చాడు. అక్కడ నైలాన్, రేయాన్, జీడిపప్పు, మిరియాల వ్యాపారాన్ని ప్రారంభించేందుకు రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ సంస్థను ఏర్పాటు చేశాడు.
ఆడెన్ లో పనిచేసిన అనుభవం, అక్కడి వ్యాపారులతో సంబంధనాలు ఈ వ్యాపారానికి కలిసి వచ్చాయి. రెండు మూడేళ్ళలో ఆయా రంగాల్లో అంతకు మునుపే ఉన్న వ్యాపారులను దాటి ముందుకు వెళ్ళాడు. 1960 ప్రాంతంలో భారతదేశంలో రేయాన్ ఉత్పత్తి ప్రారంభమైంది. అయితే నైలాన్ ని మాత్రం దిగుమతి చేసుకోవలసి వచ్చేది. అప్పటి ప్రభుత్వం రేయాన్ ఎగుమతి చేసే సంస్థలకు నైలాన్ దిగుమతుల్లో రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించింది.
ఈ నిర్ణయం అంబానీ జీవితాన్ని, వ్యాపారాన్ని మలుపు తిప్పింది.
తన పరిశ్రమనుంచి రేయాన్ ను ఎక్కువగా ఉత్పత్తి చేసి దానికి తగినంత నైలాన్ దిగుమతి చేసుకుని ఎక్కువధరకు అమ్మి లాభం సంపాదించాడు. తర్వాత ఆయన సింథటిక్ ఉత్పత్తి మీద దృష్టి సారించాడు. పదేళ్ళ కాలంలో సింథటిక్, పాలిస్టర్ ఉత్పత్తిలో రిలయన్స్ దేశంలో అగ్రశ్రేణి సంస్థల సరసన చేరింది.
సంవత్సరానికి 10వేల టన్నుల పాలిస్టర్ నూలు ఉత్పత్తి లక్ష్యంగా ముంబైకి సమీపంలోని పాతాళగంగ వద్ద 1980లో ఆధునిక పరిశ్రమను స్థాపించాడు. ఇది క్రమంగా 35వేల టన్నుల, 50 వేల టన్నుల సామర్థ్యానికి పెంచుకుంటూ పోయాడు. తర్వాత పక్షవాతంతో ఆరోగ్యం క్షీణించడంతో వ్యాపారాన్ని కుమారులకు అప్పగించాడు.
1988లో ధీరూభాయ్ అంబానీ యొక్క అనధికార జీవిత చరిత్ర, హమీష్ మెక్‌డొనాల్డ్ "ది పాలిస్టర్ ప్రిన్స్" అనే శీర్షికతో, అతని రాజకీయ మరియు వ్యాపార విజయాలన్నింటినీ వివరించింది.
అంబానీలు చట్టపరమైన చర్యలతో బెదిరించినందున ఈ పుస్తకం భారతదేశంలో ప్రచురించబడలేదు.[2] దీనిని సంస్కరించి 2010లో "అంబానీ అండ్ సన్స్" పేరుతో అమ్మకానికి వచ్చింది కాని ప్రచురణకర్తపై ఇప్పటివరకు ఎటువంటి చర్య తీసుకోలేదు.[3]
1988లో, రిలయన్స్ ఇండస్ట్రీస్ "పాక్షిక కన్వర్టిబుల్ డిబెంచర్లకు" సంబంధించి ఒక విషయంలో తమ స్టాకు ధర తగ్గకుండా ఉండేందుకు కంపెనీ అన్ని ప్రయత్నాలు చేస్తోందని ప్రచారం జరిగింది.[4] ఒక అవకాశాన్ని గ్రహించి, కలకత్తాకు చెందిన స్టాక్ బ్రోకర్ల సమూహం "ది బేర్ కార్టెల్" రిలయన్స్ షేర్లను షార్ట్ సెల్ చేయడం ప్రారంభించింది.
దీనిని ఎదుర్కోవడానికి, "ఫ్రెండ్స్ ఆఫ్ రిలయన్స్" అని పిలువబడే స్టాక్ బ్రోకర్ల సమూహం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క షార్ట్-సేల్డ్ షేర్లను కొనుగోలు చేయడం ప్రారంభించింది.[5]బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ అధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకుని మూడు రోజుల పాటు ఎక్స్ఛేంజ్ ను మూసివేసారు. బేర్ కార్టెల్ రిలయన్స్ షేర్లను మార్కెట్ నుండి అధిక ధరలతో కొనుగోలు చేసి ధీరూభాయ్ అంబానీకి తక్కువ ధరకు ఇవ్వాల్సి రావడంతో ధీరూభాయ్ అంబానీ లాభాలను ఆర్జించాడని తెలిసింది.[6]
కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఒక నూలు వ్యాపారి, సంక్షోభ సమయంలో ఇంత భారీ మొత్తంలో నగదును ఎలా పొందగలిగాడో చాలా మందికి అర్థం కాలేదు.
దీనికి పార్లమెంటులో అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సమాధానం ఇచ్చారు. 1982–83 సమయంలో రిలయన్స్‌లో ఒక ప్రవాస భారతీయుడు ₹ 220 మిలియన్ల వరకు పెట్టుబడి పెట్టాడని అతను తెలియజేశాడు. ఈ పెట్టుబడులు అనేక కంపెనీల ద్వారా మళ్లించబడ్డాయి. ఈ కంపెనీలు ప్రధానంగా ఐల్ ఆఫ్ మ్యాన్‌లో ఉండగా, ఈ కంపెనీల ప్రమోటర్లలందరికీ "షా" అనే ఇంటిపేరు ఉంది.[7] కానీ, రిలయన్స్ లేదా దాని ప్రమోటర్లు అనైతిక లేదా చట్టవిరుద్ధమైన చర్యలు లేక లావాదేవీలు ఏవీ కనుగొనబడలేదు.[8]
2002 జూన్ 24 న ఆయన గుండెపోటుతో ముంబై లో బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరాడు.
అలా రావడం ఆయనకు రెండో సారి. అంతకు మునుపు 1986 ఫిబ్రవరిలో మొదటిసారి గుండెపోటు వచ్చి కుడిచేయి పక్షవాతానికి గురైంది. రెండోసారి ఆయన ఆసుపత్రిలో ఒక వారం రోజులపాటు కోమాలో ఉన్నాడు. చాలామంది వైద్యులు తమవంతు ప్రయత్నాలు చేశారు. చివరకి 2002 జులై 6 న మరణించాడు.[9]
1986లో ఆయన మొదటిసారి జబ్బుపడ్డప్పుడే వ్యాపార వ్యవహారాలను తన ఇద్దరు కుమారులు ముకేష్, అనిల్ అంబానీలకు అప్పగించాడు.
2004 నవంబరులో ముకేష్ అంబానీ ఇచ్చిన ఒక ముఖాముఖిలో వ్యాపారం వారసత్వం విషయంలో తమ అన్నదమ్ములిద్దరి మధ్య విబేధాలున్నట్లు చెప్పాడు.[10] అయితే అవి తమ వ్యక్తిగతమైన విషయాలని చెప్పాడు.[11]
ధీరుభాయ్ మరణం తర్వాత ఆయన వ్యాపారం ముకేష్ సారథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, అనిల్ సారథ్యంలో రిలయన్స్ అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ పేర్లతో రెండుగా విడిపోయింది.
Business Standard. 2 October 2010. Retrieved 12 September 2012.
Economic Times. Retrieved January 11, 2023.
Retrieved 31 December 2010.
Business Insider. Retrieved 2019-05-20.
డిస్కవరి ఐకాన్స్. హైదరాబాద్: సైన్స్ ఫర్ యు నాలెడ్జి సొసైటీ. pp. 14–16.